
సిద్దిపేట జిల్లా : పేద మహిళకు బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. సోమవారం జిల్లాలోని గజ్వెల్ పట్టణంలో నియోజకవర్గ మహిళలకు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ ఏడాది మొట్టమొదలు బతుకమ్మ చీరల పంపిణీ గజ్వేల్ జిల్లాలో ప్రారంభించుకున్నామన్నారు. సిద్దిపేట జిల్లాలో 3 లక్షల అరవై ఐదు వేల పైచిల్లుకు మహిళలకు బతుకమ్మ చీరాల పంపిణీ చేయనున్నామని తెలిపారు.
రాష్ట్రానికి ఆర్థిక మాంద్యం వచ్చినా.. కేంద్రంలో కోత పెట్టిన కూడా పెన్షన్లు,కల్యాణ లక్ష్మీ పథకాల్లో మాత్రం కోతలు లేకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని హరీష్ రావు తెలిపారు. 30 నుంచి నలబై వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
మళ్ళీ బతుకమ్మ పండుగ వరకు కాళేశ్వరం నీళ్లలో బతుకమ్మలు వేసుకుంటామని, ఆడపడుచుల కష్టాలు తీర్చడం కోసం నూట యాబై కిలోమీటర్ల నుండి సీఎం కేసీఆర్ నీళ్లు తెచ్చారని హరీష్ అన్నారు. కాంగ్రెసోళ్లో, తెలుగు దేశం వాళ్లో ఉంటే ఊళ్ళలోకి నీళ్లు వచ్చేవా…? కాంగ్రెస్ వాళ్లు ఉండగా ఒక్క పండుగకైనా బతుకమ్మ చీరలు ఇచ్చిరా..? అంటూ మంత్రి ప్రశ్నించారు. భారత దేశంలో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని హరీష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.