అన్ని దవాఖాన్లలో డెంగీ, మలేరియా టెస్టులు

అన్ని దవాఖాన్లలో డెంగీ, మలేరియా టెస్టులు
  • కిట్లు సిద్ధంగా ఉంచాలి: మంత్రి హరీశ్​

హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ హెల్త్​ సెంటర్ల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు అన్ని చోట్ల మలేరియా, డెంగీ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై కోఠిలోని హెల్త్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లతో హరీశ్​రావు వీడియో కాన్ఫరెన్స్​లో రివ్యూ చేశారు. అంతకుముందు సరోజినీ దేవి హాస్పిటల్‌‌‌‌లో ఫాకో మెషీన్లను, కోఠిలోని ఎంసీఐ ఆఫీస్​లో మెడికల్ కౌన్సిల్ వెబ్‌‌‌‌ పోర్ట ల్‌‌‌‌ను, హెల్త్ కమిషనర్ కొత్త కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. తర్వాత మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డెంగీ, మలేరియా టెస్టుల కోసం అన్ని జిల్లాలకు కిట్లను పంపించామని తెలిపారు. ప్రజలు కూడా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సరోజినీ దేవి హాస్పిటల్‌‌‌‌లో 2 ఫాకో మిషన్లు, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్‌‌‌‌లో ఒక్కో ఫాకో మెషీన్‌‌‌‌ ప్రారంభించామని వెల్లడించారు. ఈ మెషీన్లతో పేదలకు కంటి పరీక్షలు ఫ్రీగా చేయిస్తామన్నారు. కంటి వెలుగు ద్వారా 1.64 కోట్ల మందికి ఉచితంగా టెస్టులు చేశామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్​లో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ శ్వేతా మహంతి, హెల్త్‌‌‌‌ డైరెక్టర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం

తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని మంత్రి హరీశ్​రావు అన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు 56 ఇంచుల ఛాతీ లేకపోయినా, తెలంగాణలో ప్రతి ఇంచుమీద అవగాహన ఉందని పరోక్షంగా ప్రధాని మోదీని హరీశ్‌‌‌‌ రావు విమర్శించారు. అధ్యక్షులను మార్చినా, బుజ్జగించినా ప్రతిపక్షాలపై ప్రజల ఆలోచనలో మార్పు రాదన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలకు కేసీఆర్‌‌‌‌ శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. మధ్యప్రదేశ్‌‌‌‌లో ఎరువుల కోసం జరిగిన తొక్కిసలాటలో 8 మంది రైతులు చనిపోయారని, తెలంగాణలో ఎరువులు, కరెంట్‌‌‌‌కు కొరత లేదన్నారు. బియ్యం కావాలని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు తెలంగాణను అడుగుతున్నాయని తెలిపారు. దేశంలో అదానీ బలోపేతం కావాలంటే మోదీకి ఓటేయాలని, తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో అదానీ తప్ప ఇంకెవరూ బాగుపడలేదని విమర్శించారు.