పీహెచ్‌‌సీలకు కంటి వెలుగు ఎక్విప్‌‌మెంట్స్‌‌

పీహెచ్‌‌సీలకు కంటి వెలుగు ఎక్విప్‌‌మెంట్స్‌‌
  • 18న కార్యక్రమం స్టార్ట్ కాగానే క్యాంపులు ఓపెన్‌‌ కావాలని సూచన
  • కలెక్టర్లు, డీఎంహెచ్‌‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌‌ 

హైదరాబాద్, వెలుగు: కంటి పరీక్షలకు అవసరమైన ఎక్విప్‌‌మెంట్‌‌, కళ్లద్దాలను పీహెచ్‌‌సీకు తరలించాల ని హెల్త్ ఆఫీసర్లను మంత్రి హరీశ్‌‌రావు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రానికల్లా షిఫ్టింగ్ పూర్తి చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. 18న ఖమ్మంలో కేసీఆర్ కంటి వెలుగు రెండో దశను ప్రారంభించనున్నందున అన్ని జిల్లాల కలె క్టర్లు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లతో మంత్రి ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కార్యక్రమం ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లోనూ స్ర్కీనింగ్ స్టార్ట్ చేయాలని ఆదేశించారు. క్యాంపులు ఎక్కడెక్కడ పెడుతున్నారో ప్రజాప్రతినిధులకు, ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని, డెయిలీ ఉదయం 9 గంటలకు, సా యంత్రం 4 గంటలకు అప్‌‌డేట్స్ ఇవ్వాలన్నారు. టెస్టులు చేయించుకోవాలంటే ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. ఆధార్ కార్డు తప్పనిసరి అనే విషయాన్ని ప్రజలకు ముందే చెప్పాలన్నారు.  

టెక్నీషియన్లు దొరుకుతలేరు..

కంటి వెలుగు రెండో దశలో పనిచేసేందుకు ఆప్తల్మాలజీ టెక్నీషియన్లు సరిపడా దొరకడం లేదు. మొదటి దశ కంటి వెలుగు సుమారు 8 నెలల పాటు కొనసాగింది. అప్పుడు టెక్నీషియన్లకు ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించలేదు. క్యాంపులు ముగియగానే అందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. జీతాల కోసం సుమారు ఆర్నెల్ల పాటు హెల్త్ ఆఫీసర్ల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు కంటి వెలుగు కార్యక్రమంలో పనిచేసేందుకు టెక్నీషియన్లు ఇష్టపడటం లేదని ఓ అధికారి తెలిపారు.