ఏ గ్రేడ్ ​ధాన్యానికి రూ.1,960

ఏ గ్రేడ్ ​ధాన్యానికి రూ.1,960

నిర్మల్, వెలుగు: ఎ–గ్రేడ్​ధాన్యానికి రూ. 1960 మద్దతు ధర చెల్లిస్తామని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్పారు. బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. సాధారణ ధాన్యం క్వింటాలుకు రూ.1940 గా గవర్నమెంట్​నిర్ణయించినట్లు తెలిపారు. ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ, డీసీఎంఎస్​ ల ద్వారా కొనుగోళ్లు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గన్నీ బ్యాగుల కొరత, రవాణా ఇబ్బంది లేకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిపెట్టేలా ఆఫీసర్లు అవేర్నెస్​కల్పించాలన్నారు. కేరళ, బెంగాల్,​ తమిళనాడు, ఒడిశా రైతులూ వరి సాగుచేస్తున్నారని, దీంతో మన ధాన్యం ఎగుమతి కష్టంగా మారిందన్నారు. కలెక్టర్​ముషారఫ్​అలీ ఫారూఖీ మాట్లాడుతూ జిల్లాలో పోయినేడాది కంటే ఈసారి 35 శాతం ఎక్కువ దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. రైతులను దళారులు మోసగిస్తే క్రిమినల్​కేసులు నమోదు చేస్తామన్నారు.  ఖానాపూర్​ఎమ్మెల్యే రేఖానాయక్​మాట్లాడుతూ కడెం, ఖానాపూర్​లో దిగుబడి ఎక్కువ రానుందని, ఆఫీసర్లు ఆమేరకు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్​కలెక్టర్​రాంబాబు మాట్లాడుతూ పండుగ తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయన్నారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీబీ చైర్మన్​రఘునందన్ రెడ్డి, డీసీఎంఎస్​చైర్మన్​లింగయ్య, డీఏవో అంజిప్రసాద్, డీసీవో శ్రీనివాసరెడ్డి, డీఎంవో అష్​ఫాఖ్​అహ్మద్, డీఆర్డీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.