ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు : మంత్రి జగదీష్ రెడ్డి

ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు : మంత్రి జగదీష్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొర్రీలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు, మిల్లర్లను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, వరి ధాన్యం కొనుగోళ్ల వేగవంతంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేదిలేదని స్పష్టం చేశారు.  ప్రకృతి ప్రకోపంతో ధాన్యం సేకరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని,  ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వరి ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సూచించారు.

అకాల వర్షాలతో నష్టపోయిన పంట వివరాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించి.. నివేదిక అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలను సేకరించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి...అదనపు అధికారులతో పర్యవేక్షించాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గుండెల్లో రైతులు ఉన్నారని, వ్యవసాయానికి గౌరవం పెరిగింది ముఖ్యమంత్రి వల్లే అని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ సాగుకు అందిస్తున్న సహకారం, పథకాలు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ప్రతి గింజను కూడా కొంటామని స్పష్టం చేశారు.