
సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే..బీజేపీ మాత్రం ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు మెచ్చుకుంటున్నాయని చెప్పారు. కేసీఆర్పై అక్కసుతో రాష్ట్ర సంక్షేమాన్ని చీకట్లోకి నెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 8 ఏండ్లలో మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రశ్నించే వారిని బీజేపీ అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థలను దుర్వియోగ పరుస్తూ.. దేశంలో కల్లోలానికి బీజేపీ కారణమవుతోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
చివరకు ధర్మమే గెలుస్తుంది..
ముఖ్యమంత్రులను పదవీ నుంచి దించడం..సభ్యత్వాన్ని రద్దు చేయడం.. పార్టీలను చీల్చే కుట్రలు చేస్తూ బీజేపీ తన ఫ్యూడల్ లక్షణాలను బయటపెడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కుట్రలను దేశ ప్రజలు నిలదీసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందని చెప్పారు. జనమే లేని బీజేపీ సభలను అడ్డుకునే అవసరం తమకు లేదన్నారు. అనుమతులు లేకుండా సభలు జరగవన్న విషయం బీజేపీకి తెలియదా..? అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.