- పార్టీ సూచనతో ప్రభుత్వం నడవాలి కానీ ప్రభుత్వ సూచనతో పార్టీ నడుస్తోంది
- రేవంత్‌రెడ్డి కంపెనీలో బ్యాండ్ వాగన్‌గా కొనసాగలేను
- ఆత్మగౌరవం కోసమే బయటకు వచ్చా : మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల, వెలుగు : ‘కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారింది, పార్టీ సూచనలతో ప్రభుత్వం నడవాల్సిన ఉండగా... ప్రస్తుతం ప్రభుత్వ సూచనలతోనే పార్టీ నడుస్తోంది’ అని మాజీమంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి కంపెనీలో తాను బ్యాండ్ వాగన్‌గా కొనసాగలేనన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీ కార్యకర్తలకు ఫలాలు అందడం లేదన్నారు. గత 20 నెలలుగా ఓపిక పట్టాను, కానీ మున్సిపల్ ఎన్నికల సమయంలో పరిస్థితులు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు.
కార్యకర్తల హక్కులను కాపాడలేకపోవడం తనకు మానసిక వేదన కలిగించిందని చెప్పారు. తనకు పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని, గౌరవం లేని పదవికి విలువ లేదన్నారు. అవమానాలు ఎదురైనప్పుడే పోరాటం ప్రారంభించాలని, ప్రజల పక్షాన నిలవాలన్న ఉద్దేశంతోనే బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారని, వైకుంఠధామాలు, డంప్ యార్డులు, ప్రకృతివనాలు, హరితహారం వంటి కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం రెండేండ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేమీ చేయలేదని విమర్శించారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వాలని, స్థానిక సంస్థలకు అధికారం కల్పించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద సమస్యను రాజకీయ కోణంలో చూపకుండా సత్వరమే పునర్నిర్మాణం చేపట్టాలని, లేదంటే రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని, రాజకీయ కారణాలతో వేర్వేరు దారుల్లో నడిచామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సమర్థమైన నాయకత్వం అవసరమని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో ఆలోచన పెరుగుతోందని అన్నారు.

