
- నైతిక హక్కుల గురించి కేసీఆర్ మాట్లాడితే నవ్వొస్తున్నది
- పదేండ్ల పాలనలో ఆయన చేసిందేమిటి?: మంత్రి జూపల్లి
- ప్రజా పాలన చూసే ఎమ్మెల్యేలు వస్తున్నరు
- రాహుల్‌కు లేఖ రాసే అర్హతనిరంజన్ రెడ్డికి లేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: నైతిక హక్కులు, విలువల గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించే మాట్లాడే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీస్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదు.
ఆయన కృష్ణా నదిని ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నడు. నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీస్కుంటది. మా పదవులు పోవడానికి మీరే కారణమంటూ కేసీఆర్‌కు లేఖ రాస్తే బాగుంటది. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నరు. బీజేపీతో కుమ్మక్కై మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నది’’అని అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి యాత్రలకు పోయినట్లు.. నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పోటీలో దించి.. బీజేపీ క్యాండిడేట్ల గెలుపునకు కేసీఆర్ పని చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్లో భవిష్యత్తు లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ ప్రయత్నిస్తుంటే.. జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.