‘పాలమూరు’ స్పీడ్ పెంచండి: మంత్రి జూపల్లి కృష్ణారావు

‘పాలమూరు’ స్పీడ్ పెంచండి: మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ టౌన్​/ కొల్లాపూర్/ వనపర్తి/ రేవల్లి, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులను స్పీడ్​గా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ గెస్ట్ హౌస్‌‌‌‌‌‌‌‌లో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు, భూ సేకరణ పురోగతిపై సమీక్షించారు. 

అలాగే ఏదుల, నార్లాపూర్​ రిజర్వాయర్ల వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేసి నిర్మాణాల్లో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

బీఆర్​ఎస్​ ఒక్క మోటరే పెట్టింది..

బీఆర్​ఎస్​ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం అబద్ధమన్నారు. రిజర్వాయర్లు, కాలువలు, పంప్ హౌస్‌‌‌‌‌‌‌‌ల పనులు ఇంకా పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయన్నారు. నార్లాపూర్ వద్ద తొమ్మిది మోటార్లలో ఒక్కటే అమర్చారని, ఇప్పుడు తాము మరో మూడు ఏర్పాటు చేశామని, ఇంకా ఐదు మోటార్లు బిగించాల్సి ఉందని వివరించారు. ప్రాజెక్టు పూర్తి అయితే నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రంగారెడ్డి జిల్లాకు తాగునీరు సరఫరా చేయగలమని పేర్కొన్నారు. 

జూన్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శించి సమీక్షించనున్నట్లు వెల్లడించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.