
- కేటీఆర్‌పై మంత్రి జూపల్లి ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆనాడు బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఆ సిగ్గు ఎటుపోయిందని కేటీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా అని కేటీఆర్ అంటున్నారని... గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిందేమిటని నిలదీశారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్ ఎందుకు జవాబివ్వడం లేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు సిగ్గులేని పనులు ఎన్నో చేశారు. పెగ్గులు పోసే వారికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చినప్పుడు సిగ్గు అడ్డు రాలేదా కేటీఆర్?’’ అని జూపల్లి మండిపడ్డారు.
ప్రభుత్వం కూలిపోతుందని కేటీఆర్ అన్న మాటలపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే కుట్రతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో తాను చేసిన వాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేశారు. ఎవరు, ఏ పార్టీలో చేరలేదని, ఎవరైనా పార్టీ మారితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తాను కూడా బీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చానని, అయితే తాను తెలంగాణ కోసం పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. అంతమాత్రాన తాను తప్పుచేసినట్లా అని ప్రశ్నించారు. తెలంగాణ పరిస్థితి చూసి చలించి మళ్లీ కాంగ్రెస్ లోకి రావాల్సి వచ్చిందన్నారు.