ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :  మంత్రి జూపల్లి కృష్ణారావు

పానుగల్, వెలుగు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పానుగల్ మండలంలోని మాందాపూర్, కొత్తపేట, బహుదూర్ గూడెం గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, కొత్తపేటలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, బహుదూర్ గూడెంలో రూ. 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, దావాజీపల్లి నుంచి పుల్గరచర్ల వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుందని, ప్రతీ ఇల్లు ఒక లైబ్రరీ కావాలని, తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగ్గా ఉందని, విద్య, వైద్య రంగాల బలోపేతానికి ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, స్థానిక అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.