- మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని 11వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పట్టణ రూపురేఖలు మార్చాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
కొల్లాపూర్‌ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే విద్యా, వైద్య రంగాలతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదలకు కృషి చేశామని గుర్తుచేశారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు, భవిష్యత్‌లో మరిన్ని భారీ ప్రాజెక్టులతో పట్టణాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
