వారసత్వ సంపదను రక్షించుకుందాం..మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు పిలుపు

వారసత్వ సంపదను రక్షించుకుందాం..మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు పిలుపు
  • సమాజాభివృద్ధిలో వారసత్వానిది ప్రధాన పాత్ర అని కామెంట్

హైదరాబాద్, వెలుగు: వారసత్వం సమాజ మనగుడకు మైలురాయిగా నిలుస్తుందని మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ప్రపంచ వార‌‌స‌‌త్వ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమాజం అభివృద్ధిలో వారసత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సంవత్సరం థీమ్  ద్వారా ప్రకృతి విపత్తులు, సంఘ‌‌ర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక వారసత్వ ప్రదేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి సారించామని చెప్పారు. గత 60 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్  కౌన్సిల్  ఆన్  మాన్యుమెంట్స్  అండ్  సైట్స్  చేపట్టిన చర్యల ద్వారా సేకరించిన అనుభవాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, భవిష్యత్తులో అపాయాలను ఎలా ఎదుర్కొవాలి అనే అంశంపై చర్చకు ఇది ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

కాలక్రమంలో ప్రపంచ వారసత్వ జాబితాలో తన స్థానాన్ని తెలంగాణ స్థిరంగా పెంచుకుంటూ  వ‌‌స్తున్నద‌‌ని, 2021లో రామప్ప దేవాలయానికి యునెసో గుర్తింపు లభించగా,  ఈ ఏడాది ముడుమాల్  నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో స్థానం దక్కడం తెలంగాణకు గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక,  ప్రకృతి సంబంధ వారసత్వాన్ని రక్షించేందుకు, పునరుద్ధరించేందుకు, ప్రోత్సహించేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నద‌‌న్నారు.