
- తెలుగు సాహిత్యానికి గొప్ప చరిత్ర ఉంది: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: సమాజ చైతన్యంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ సంబురాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తల పాత్ర అమోఘమని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు.
మన తెలుగు సాహిత్యానికి ఏనలేని చరిత్ర ఉందని, నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ నుంచి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ తర్వాత దాశరథి, కాళోజీ వంటి వారి రచనలు ప్రజలను చైతన్యం పరిచాయన్నారు. సామాజిక రుగ్మతలు, యువతలో పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజంలో సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు, కళాకారులపై ఉందన్నారు. రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నెల్లుట్ల రమాదేవి, ఇతర కవులు, సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు పాల్గొన్నారు.