సైనికుల వీరత్వం.. భారతీయులకు స్ఫూర్తి : మంత్రి జూపల్లి

సైనికుల వీరత్వం.. భారతీయులకు స్ఫూర్తి : మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: సైనికుల వీరత్వం తరాలపాటు భారతీయులకు స్ఫూర్తినిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 54వ విజయ్ దివస్ సందర్భంగా 1971లో ధైర్యం, త్యాగంతో భారత్‌‌‌‌‌‌‌‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. వారి దృఢ సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని, దేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించారని పేర్కొన్నారు. 

ఈ విజయ్ దివస్ వారి పరాక్రమానికి వందనమర్పించేదిగా, వారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. విజయ్ దివస్‌‌‌‌‌‌‌‌ను పురస్కరించుకుని మంగళవారం గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకలకు మంత్రి జూపల్లి హాజరై మాట్లాడారు. 1971 యుద్ధంలో భారత సాయుధ దళాలు కేవలం 13 రోజుల్లోనే చారిత్రక విజయం సాధించాయని, 93 వేల మంది పాకిస్థాన్ సైనికులు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ అవతరించిందని మంత్రి గుర్తు చేశారు.  

అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దృఢమైన నాయకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం ఆమె ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని, సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు.