
- విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు బాధ్యత తీసుకోవాలి: మంత్రి జూపల్లి
- పరిశోధనల కోసం ఉస్మానియా వర్సిటీకి రూ.కోటి మంజూరు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, జీవనవిధానంపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పరిశోధనల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తమ శాఖ ద్వారా రూ.కోటి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో ‘ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో విభిన్న అంశాల సంవాదం, సంభాషణ’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవన విధానం గతి తప్పడం ఎన్నో సమస్యలకు కారణమవుతుందని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, దురలవాట్లు, తాహతుకు మించిన ఆడంబరాల వల్ల కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు తెలంగాణ జీవన విధానంపై పరిశోధనలు జరిపి మార్పు తీసుకొచ్చే దిశగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మానవీయ, సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు విస్తృతమైనప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆకాంక్షించారు. ఓయూ వీసీ కుమార్ మొలుగరం మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విభిన్న అంశాల్లో ప్రావీణ్యం పొందాల్సిన అవసరం ఉందన్నారు.
నైపుణ్యాభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిసారించాయని, విధాన నిర్ణయాల్లో భాగంగా మల్టీ డిసిప్లీనరీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులలో పరిశోధనాత్మక విలువలను పెంపొందింపజేసే పనులు చేస్తున్నందుకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌ని అభినందించారు. అనంతరం దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధకులు వచ్చి వారి పరిశోధన పత్రాలను సమర్పించారు.