మహనీయుల కలలను సాకారం చేయడమే నిజమైన నివాళి : మంత్రి జూపల్లి

మహనీయుల కలలను సాకారం చేయడమే నిజమైన నివాళి : మంత్రి జూపల్లి
  •     అసమానతలు, రుగ్మతలను రూపుమాపాలి: మంత్రి జూపల్లి
  •      రవీంద్ర భారతిలో ఘనంగా స్వాతంత్య్ర సమరయోధుల స్మరణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న భారతావనిని నిర్మించడమే ఆ మహనీయులకు మనమిచ్చే నిజమైన నివాళి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేతాజీ సుభాష్  చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, సుద్దాల ఫౌండేషన్  సంయుక్త ఆధ్వర్యంలో వీరభారతం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేతాజీ, భగత్ సింగ్, అంబేద్కర్  వంటి మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చారని, స్వాతంత్ర్య పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎంతో మంది త్యాగాలు చేశారని గుర్తుచేశారు. సమాజంలో అసమానతలు, రుగ్మతలను రూపుమాపినప్పుడే వారి ఆశయాలు నెరవేరుతాయని పేర్కొన్నారు.

దేశభక్తి, ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. త్వరలోనే కళాకారులు, మేధావులను భాగస్వాములను చేస్తూ ప్రభాతభేరి పేరుతో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాగా, 40 నిమిషాల పాటు సాగిన ‘వీర భారతం’ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అద్భుతమైన రూపకాన్ని అందించిన సినీ గేయరచయిత డాక్టర్  సుద్దాల అశోక్ తేజ, నటుడు ఉత్తేజ్, త్రైలోక్య ఆర్ట్  అసోసియేషన్  ఇందిర పరాశరంను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్  ఏనుగు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.