కమీషన్లు రావనే ఎస్ఎల్‎బీసీని పక్కన పెట్టిండు: కేసీఆర్‎పై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు

కమీషన్లు రావనే ఎస్ఎల్‎బీసీని పక్కన పెట్టిండు: కేసీఆర్‎పై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు

హైదరాబాద్: బీఆర్‎ఎస్ అధినేత కేసీఆర్‎పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని.. అందుకే మూడేళ్లకే ఆ ప్రాజెక్టు కుప్పకూలిందని ఆరోపించారు. కమీషన్లు రావనే ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్టును కేసీఆర్ పక్కకు పెట్టిండని ఆరోపించారు. సోమవారం (నవంబర్ 3) ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనుల కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర సీఎం రేవంత్ సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే నిర్వహించారు. 

సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి బెస్ట్ నిపుణులను సలహాదారులుగా నియమించుకున్నామని తెలిపారు. టన్నెల్ పనులను ముందుకు తీసుకెళ్లడానికి భూగర్భంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టామని చెప్పారు. ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.