లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు సంబంధమేంటి? : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు సంబంధమేంటి? :  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్,వెలుగు: లిక్కర్​ కేసులో ఎమ్మెల్యీ కవితను అరెస్ట్  చేసింది ఢిల్లీ పోలీసులైతే  బీఆర్ఎస్​ నాయకులు ధర్నాలు చేసి రాష్ట్ర  ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శించారు. ఢిల్లీ లిక్కర్​కేసుకు, తెలంగాణ ప్రజలకు సంబంధమేమిటని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా జరిగిన ధర్నాలను, ర్యాలీలను అడ్డుకున్న వ్యక్తులే ఈరోజు  ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్​ నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాలకు హైదరాబాద్ లో ధర్నాలు ఎందుకని ప్రశ్నించిన బీఆర్ఎస్  నాయకులు... ఇప్పుడు ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తే తెలంగాణలో ధర్నాలకు ఎందుకు పిలుపునిస్తున్నారు? ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్పెషల్  ఫ్లైట్లు బుక్  చేసి మీ (బీఆర్ఎస్) కార్యకర్తలను ఢిల్లీకి తీసుకపోయి ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేసుకోండి. అమాయక కార్యకర్తలను రోడ్ల మీదకి తేవడం ఎందుకు? కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయి. మళ్లీ మీ కుటిల రాజకీయాలతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టొద్దు” అని మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్  కుమ్మక్కై రాయలసీమకు నీళ్లివ్వడం వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయని ఆయన మండిపడ్డారు.

మన సంస్కృతి ఉట్టిపడేలా ఢిల్లీలో తెలంగాణ భవన్  నిర్మిస్తం

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఢిల్లీలో తెలంగాణ భవన్​ నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టం- 2014 నియమ నిబంధనలకు అనుగుణంగా ఢిల్లీలోని ఏపీ  భవన్  విభజన పూర్తయిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాలకు పంపిన లేఖను మీడియాకు ఆయన విడుదల చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్-జీ కి ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో విభజన పూర్తయిందని, అందుకు సీఎం రేవంత్  రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని మంత్రి చెప్పారు.