బీఆర్​ఎస్​ ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేస్తం : వెంకట్ రెడ్డి

బీఆర్​ఎస్​ ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేస్తం : వెంకట్ రెడ్డి
  • చర్చలే తప్ప.. కక్ష సాధింపులుండవ్​: మంత్రి వెంకట్ రెడ్డి    
  • ప్రజా పాలన దిశగా ముందుకెళ్తామని వ్యాఖ్య
  • భువనగిరి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా

న్యూఢిల్లీ, వెలుగు : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సహా, గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేస్తామని అర్ అండ్ బీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న మంచి, చెడ్డ నిర్ణయాలపై కేబినెట్ లో చర్చిస్తామే తప్ప.. కక్ష సాధింపు చర్యలకు పోమని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారి సోమవారం వెంకట్​రెడ్డి ఢిల్లీకి వచ్చారు. ముందుగా తన భువనగిరి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు, సహకారం అందించాలని గడ్కరీని మంత్రి వెంకట్​రెడ్డి కోరారు. ఆ తర్వాత ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని, కేంద్రం నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్ -విజయవాడ మధ్య ఆరు లైన్ల రహదారి పెండింగ్ అంశాన్ని మరోసారి మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ అంశంపై 10 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. అలాగే రూ. 600 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. మొత్తం 14 రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానన్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి.. వచ్చే రెండేండ్లలో అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణను మెరుగ్గా తయారు చేసేలా ప్రయత్నం చేస్తానన్నారు. బీటీ రోడ్లకు గుంతలు పడితే..గత ప్రభుత్వం మట్టితో పూడ్చివేసిందని వెంకట్​రెడ్డి గుర్తుచేశారు. 

ఢిల్లీలో తెలంగాణ భవన్​ నిర్మాణానికి ప్రణాళిక

ఒకటి రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి డిజైన్ చేసి.. మార్చిలో శంకుస్థాపన చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి వెంకట్​రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ పంపకాల గురించి మంగళవారం భవన్ అధికారులతో రివ్యూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

100 రోజుల్లో హామీలు అమలు..

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని హామీలు నెరవేర్చనున్నట్లు మంత్రి తెలిపారు. 100 రోజుల్లో అన్నీ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క టీచర్​ పోస్టూ భర్తీ చేయలేదని, ఒక్క ఇల్లు నిర్మించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6 వేల స్కూళ్లు మూతబడ్డాయని విమర్శించారు. భువనగిరి ప్రజలు ఎంపీగా గెలిపించి తనకు పునర్జన్మ ఇచ్చారని, వారికి రుణపడి ఉంటానని, ఆ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని వెంకట్​రెడ్డి చెప్పారు.