- అధికారం పోయిందని బావబామ్మర్ది బాధ పడుతున్నరు
- డిసెంబర్ 9న అసలైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
నిజామాబాద్, వెలుగు : ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇటు అసెంబ్లీకి, అటు ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లలో పోటీ చేసిన బీఆర్‌ఎస్‌కు ఏడు చోట్ల డిపాజిట్ దక్కలేదని, అలాంటి పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కలేనన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ సర్కార్ రాబోతోందని బావాబామ్మర్దులు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు నిజాలు గ్రహించి అధికారాన్ని దూరం చేశారన్న బాధ కేటీఆర్, హరీశ్‌రావులో ఇంకా పోవడం లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు, కేసీఆర్‌కు సంబంధమే లేదని, శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి 1,100 మంది ప్రాణాలు త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలమంతా సోనియాగాంధీ వద్దకు వెళ్లి రాష్ట్ర ఏర్పాటు కోసం ఒప్పించామని చెప్పారు. డిసెంబర్9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా సొంత ప్లేస్ ఉన్న వారికి రూ.5 లక్షలు మంజూరు చేసి ఇండ్ల స్కీమ్‌ను స్టార్ట్ చేస్తామన్నారు. అదే రోజు సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం ఆవిష్కరించబోతున్నట్లు ప్రకటించారు.
రీజినల్ రింగ్ రోడ్డుకోసం సంగారెడ్డి, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు భూ సేకరణ చేసి వర్డ్ క్లాస్ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మార్చి నాటికి టెండర్లు పూర్తి చేసి నాలుగేండ్లలో పనులు కంప్లీట్ చేసే ప్లాన్‌తో ముందుకువెళ్తున్నామన్నారు. ప్రధాని మోదీ నిజామాబాద్‌కు ప్రకటించిన పసుపు బోర్డు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.