
కాళేశ్వరం నిర్మాణంలో అన్నీతానే అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్... అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్ తప్పు ఒప్పుకున్నట్టేనన్నారు. కేసీఆర్ హయాంలోనే కట్టిన కాళేశ్వరం ఆయన హయాంలోనే కూలిందన్నారు. కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి..సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారని చెప్పారు. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చే బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం పూర్తి నివేదికపై కంప్లీట్ గా చర్చ ఉంటుందన్నారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు భయపడే కేసీఆర్, హరీశ్ రావు కోర్టుకు వెళ్లారని చెప్పారు కోమటిరెడ్డి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తప్పు అని భావిస్తే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు. కాళేశ్వరం విషయంలో తప్పైతే కేసీఆర్ తప్పుని బాధ్యతగా ఒప్పుకోవాలన్నారు. కాళేశ్వరంపై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ప్రజల ముందు దోషులుగా నిలబెడుతాం..తప్పు చేసిన వాళ్లను ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు కోమటిరెడ్డి. కేసీఆర్ కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ద,డిండి, పాలమూరు ప్రాజెక్టులపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఆగస్టు 31 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదిక, రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.