- వచ్చే దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేస్తం : మంత్రి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఉప్పల్, వరంగల్ మార్గంలో బీటీ రోడ్డు నిర్మిస్తున్నామని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.అలాగే, ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను వచ్చే ఏడాది దసరా నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఈ విషయంపై బుధవారం ఆర్ అండ్ బీ, మోర్త్ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ రూట్‌లో ప్రస్తుతం ఉన్న గతుకుల రోడ్డు మార్గంలో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తాను ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించి, వెంటనే బీటీ రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉప్పల్, వరంగల్ మార్గంలో ఇంజినీర్లు ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలు పెట్టారన్నారు. జాతర ప్రారంభం వరకు నాణ్యమైన రోడ్డు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మొత్తం 5.5 కిలోమీటర్లకు గాను 1.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు.
