- మోర్త్ ఇంజినీర్లతో భేటీలో మంత్రి వెంకట్ రెడ్డి వెల్లడి
- డిటేయిల్డ్ ఎస్టిమేషన్ తయారీ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎల్బీ నగర్ నుంచి- హయత్ నగర్ వరకు నిర్మించనున్న డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు రాష్ట్ర వాటాగా రూ.200 కోట్లు ఇస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆ కారిడార్ పై గురువారం సెక్రటేరియెట్లోని ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయంలో గురువారం కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ (మోర్త్) ఇంజినీర్లతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ కారిడార్ నిర్మాణానికి సంబంధించి డిటేయిల్డ్ ఎస్టిమేషన్ తయారీపై చర్చించారు. నేషనల్ హైవే 65 రూట్లోని ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, ప్రమాదాలను నియంత్రించడానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు రూ.941 కోట్లు ఖర్చుకానుండగా.. రాష్ట్ర వాటాగా రూ.200 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 54 కాలనీలకు చెందిన సుమారు 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు సమయం కలిసివస్తుందన్నారు. వచ్చే వారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కోరుతానని చెప్పారు. ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు 7.1 కిలోమీటర్ల దూరం నిర్మించే ప్రాజెక్టును ఈ వార్షిక ప్రణాళికలో పెట్టినట్టు మోర్త్ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ తెలిపారు. కింద సర్వీస్ రోడ్డు, మధ్యలో నేషనల్ హైవే, పైన మెట్రో రైలు వెళ్లేలా కారిడార్ నిర్మాణం జరనుందని, రెగ్యులర్ ఎలివేటెడ్ కారిడార్ కన్నా పటిష్టంగా, వెడల్పుగా పిల్లర్లు నిర్మించాల్సిన ఉంటుందని చెప్పారు.

