నా మాటలు వక్రీకరించారు .. కమీషన్లు, పర్సంటేజీలకు సంతకాలు పెట్టింది బీఆర్ఎస్‍ మంత్రులే: మంత్రి కొండా సురేఖ

నా మాటలు వక్రీకరించారు .. కమీషన్లు, పర్సంటేజీలకు సంతకాలు పెట్టింది బీఆర్ఎస్‍ మంత్రులే: మంత్రి కొండా సురేఖ
  • తప్పుడు ట్రోలింగ్ ఆపకుంటే.. సైబర్ క్రైమ్ వాళ్లకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్

వరంగల్, వెలుగు: బీఆర్ఎస్​నేతలు తన మాటలను వక్రీకరించి సోషల్​మీడియాలో తప్పుడు  ప్రచారం చేయిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఫైర్​అయ్యారు. ‘‘బీఆర్ఎస్‍ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రులే పదేండ్లపాటు ప్రతి ఫైల్‍కు డబ్బుల్లేకుండా సంతకాలు పెట్టలేదు. ముందుగా పర్సంటేజీలు మాట్లాడుకొని పెద్దఎత్తున కమీషన్లు వచ్చే సెలెక్టెడ్ ఫైళ్లపై మాత్రమే సంతకాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ, మిషన్‍ భగీరథ పర్సంటేజీలు అలాంటివే. నేను ఇదే విషయాన్ని చెబితే.. బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటు వారి పెయిడ్ బ్యాచ్‍ నాపై తప్పుగా ట్రోల్‍ చేస్తోంది. వారికి కుటుంబం, అక్కాచెల్లెళ్లు ఉంటే ఇలానే చేస్తారా? కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పిచ్చిపిచ్చిగా రాయించడం చాలా బాధాకరం. 

ఎడిటింగ్, మార్ఫింగ్  చేసిన వీడియోలతో చేసిన ట్రోలింగ్ ఆపకుంటే సైబర్ క్రైమ్ వాళ్లకు ఫిర్యాదు చేస్తా. కేటీఆర్‍ నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి” అని మంత్రి సురేఖ అన్నారు. గురువారం వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. కృష్ణాకాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‍ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఫారెస్ట్ మినిష్టర్‍గా ఉన్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు వారి ప్రాజెక్టుల క్లియరెన్స్​కు ఫైళ్లతో తన వద్దకు వస్తారని, మాములుగా అయితే మంత్రులు డబ్బులు తీసుకుని సంతకాలతో ఫైళ్లు క్లియర్‍ చేస్తారని.. తాను మాత్రం తమకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరంలేదని.. సమాజసేవ చేయడం ద్వారా మా స్కూల్‍ డెవలప్‍ చేయాలని వారితో చెప్పానని అన్నారు.

 కాగా, మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీశాయి. ప్రతిపక్షాలు సురేఖను కేంద్రంగా చేసుకుని సోషల్‍ మీడియా ద్వారా ప్రభుత్వంపై ఎటాక్‍ చేశాయి. దీంతో మంత్రి సురేఖ శుక్రవారం హనుమకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలోని మంత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారని, తమవద్దకొచ్చే వివిధ కంపెనీలను ఒప్పించి.. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ ఇప్పించడం ద్వారా స్కూళ్లు, కాలేజీల నిర్మాణానికి సేవాగుణంతో పని చేస్తున్నామన్నారు. దీనిని బీఆర్ఎస్‍ సోషల్‍ మీడియా వక్రీకరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి ప్రజల కోసం పనిచేయడమే తెలుసని పేర్కొన్నారు.