హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న పలువురు అధికారులపై వేటు వేశారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఆలయంలో పని చేస్తున్న జి. రాము, పి.నరసింహ, ఎస్.శ్రీహరి, జి. ప్రభాకర్ రావు అనే నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. అర్చకుడు ఎ. శ్రీనివాసాచార్యులకు చార్జ్ షీట్ మెమో జారీ చేయాలని ఆదేశించారు. పరిపాలనా, పర్యవేక్షణ లోపాలకు బాధ్యులైన సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)ను సస్పెండ్ చేయాలని కూడా మంత్రి ఆదేశించినట్లు సమాచారం. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించినట్టు తెలిసింది.
