చిల్లర మాటలు బంజెయ్ : కొండా సురేఖ

చిల్లర మాటలు బంజెయ్ : కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్ సర్కార్ పై చేస్తున్న చిల్లర విమర్శలు, చిల్లర మాటలు బంజేయాలని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.  కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల కూడా గడవకముందే 100 రోజుల్లో కూలిపోతుందనడం సరికాదన్నారు.

 కాంగ్రెస్ సర్కారుకు తగిన సమయం ఇవ్వకుండా..మళ్లీ ఎలక్షన్లు వస్తాయని చెబుతూ  ప్రజలను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో  మండిపడ్డారు. ఆయన కాస్త  ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మంత్రి సురేఖ సూచించారు. గత ప్రభుత్వం తొమ్మిదిన్నర  ఏండ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు.

ఉద్యమకారులను అన్యాయంగా పార్టీలో నుంచి బయటకు పంపించారన్నారు.  మహిళలపై దాడులు జరిగితే,  కొండగట్టు ప్రమాదంలో 63 మంది చనిపోతే స్పందించని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు ప్రజల మీద ప్రేమ  ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ లో సెంట్రల్ జైల్ ను కూల్చి  హాస్పిటల్ కడితే బాగుంటుందని తాను మాట్లాడితే దానిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే  రెండు గ్యారంటీలను అమలు చేశామని,  ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా  ఉందని సురేఖ పేర్కొన్నారు.