కాకతీయ జూపార్క్‌‌ను అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ

కాకతీయ జూపార్క్‌‌ను అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ

 

కొత్తగా వైట్‌‌ టైగర్‌‌ ఎన్‌‌క్లోజర్‌‌  ప్రారంభం

వరంగల్‍, వెలుగు : హైదరాబాద్‌‌లోని నెహ్రూ జూపార్క్‌‌ తరహాలో... వరంగల్‌‌లోని కాకతీయ జూపార్క్‌‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. గ్రేటర్‌‌ వరంగల్‌‌లోని జూకు కొత్తగా తెల్ల పులిని తీసుకొచ్చిన నేపథ్యంలో.. పులి ఎన్‌‌క్లోజర్‌‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూపార్క్‌‌లో రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వరంగల్‌‌ జూపార్క్‌‌ను గత పదేండ్లలో బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ పట్టించుకోలేదని, చిన్నపాటి వానలకే జూపార్క్ నీట మునిగేదన్నారు. తాము వచ్చాక పార్క్‌‌ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలిపారు. త్వరలో ఆడ తెల్ల పులి, సింహాన్ని సైతం తీసుకురానున్నట్లు చెప్పారు. అనంతరం మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 18 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఐదు శాఖల సమన్వయంతో టార్గెట్‌‌ను పూర్తి చేస్తామని చెప్పారు. తర్వాత వరంగల్‍ ఎల్‌‌బీ నగర్‍లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొని తూర్పు నియోజకవర్గంలోని 198 స్వయం సహాయక సంఘాలకు రూ. 14.87 కోట్ల రుణాలను అందజేశారు.