పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంక్షేమ రాజ్యం : మంత్రి సురేఖ

పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంక్షేమ రాజ్యం : మంత్రి సురేఖ
  • వంద రోజుల పాలనలోనే ఐదు గ్యారంటీలు అమలు: మంత్రి సురేఖ
  • లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఘన విజయం అందించాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: వందరోజుల పాలనలోనే ఐదు గ్యారంటీల అమలును ప్రారంభించామని, పార్లమెంట్​ ఎన్నికల తర్వాత మిగతా గ్యారంటీలను అమలు చేసి సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. పదేండ్ల అహంకార పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు.

తుక్కుగూడ కాంగ్రెస్ జన జాతర సభలో ఆమె మాట్లాడుతూ..  బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ ఖాళీ అవుతున్నదన్న భయం, అసహనంతో కేసీఆర్, కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియాలో వస్తున్న ఫోన్ ట్యాపింగ్ వార్తలను ప్రస్తావిస్తే కేటీఆర్ భుజాలు తడుముకుంటూ లీగల్ నోటీసులు పంపాడని అన్నారు. సిరిసిల్ల ప్రెస్ మీట్‌‌లో కుక్కల కొడుకులు అని తిట్టిన కేసీఆర్.. మహిళలను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేసీఆర్ అలా తిట్టినందుకు ఆయనకు నోటీసులు ఇవ్వద్దా? అని ప్రశ్నించారు. బీఆర్‌‌‌‌ఎస్ అవినీతి, అక్రమాలు, నియంతృత్వ పోకడలతో అధికారాన్ని పోగొట్టుకుంటే,  తాము ప్రజల విశ్వాసంతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. చవటలు, దద్దమ్మలు అయిన బీఆర్ఎస్ నాయకులు నోళ్లు దగ్గర పెట్టుకోవాలని సురేఖ హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆమె అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  వీరోచితంగా పోరాడి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించాలని సురేఖ పిలుపునిచ్చారు.