
హైదరాబాద్, వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47.64 లక్షల తాటి, ఈత మొక్కలు నాటాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రెండేళ్ల కాలపరిమితిలో ఈ లక్ష్యాన్ని అందుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆమె సూచించారు. 2025లో 25 లక్షల ఈత మొక్కలను నాటబోతున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరంలో 22 లక్షల ఈత మొక్కలను నాటాలని నిర్ణయించామని చెప్పారు. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ నర్సరీల్లో మొత్తం 45.37 లక్షల ఈత మొక్కలను సిద్ధంగా ఉంచామన్నారు.
ఈ ఏడాది వన మహోత్సవంలో రాష్ట్రవ్యాప్తంగా 18.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. రాష్ట్రంలో 24.05 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతానికి పెంచే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14,355 నర్సరీలలో 20 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచామని మంత్రి పేర్కొన్నారు.