మున్సిపల్​ కమిషనర్​పై చర్యలు తీసుకోండి

మున్సిపల్​ కమిషనర్​పై చర్యలు తీసుకోండి

బర్త్ డే మెమో వివాదంపై మంత్రి కేటీఆర్​ సీరియస్​ అయ్యారు. రాజకీయాల్లో లేదా  పరిపాలనలో కానీ ఇలాంటి  పిచ్చి పనులను తాను ప్రోత్సహించనని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. తన అసంబద్ధ ప్రవర్తనకు మున్సిపల్​ కమిషనర్​ని సస్పెండ్ చేయమని @cmdatelanganaని కోరినట్లు ట్విట్టర్‌లో  పేర్కొన్నారు. 

జులై 24  కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ వాట్సాప్ మెసెజ్ పంపారు. కానీ  ముగ్గురు సిబ్బంది హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన మున్సిపల్ కమిషనర్.. ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బర్త్ డే వేడుకలకు హాజరుకాని సీనియర్ అసిస్టెంట్  టి.రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్  పున్నం చందర్ , సిస్టమ్ మేనేజర్ మోహన్ కు మెమోలు జారీ చేశారు.  ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. నోటీసుల అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 బెల్లింపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురి సిబ్బందికి నోటీసులు ఇచ్చిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై  విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఉద్యోగ వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. ముగ్గురు ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకున్నారు.