తెలంగాణలో మళ్లా కేసీఆరే సీఎం : కేటీఆర్

తెలంగాణలో మళ్లా  కేసీఆరే సీఎం : కేటీఆర్
  • కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
  • మనం చెప్పినోళ్లే ప్రధానమంత్రి అయితరు
  • తెలంగాణలో మళ్లా  కేసీఆరే సీఎం అని ధీమా

యాదాద్రి, వెలుగు : త్వరలో చేనేత రుణాలను మాఫీ చేస్తామని మంత్రి కేటీఆర్ ​ప్రకటించారు. సీఎం కేసీఆర్​తో మాట్లాడి వెంటనే అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేశామని, మరోసారి నేత కార్మికులు కోరుతున్నందున లెక్కలన్నీ చూసి వెంటనే అమలయ్యేలా చూస్తామన్నారు. యాదాద్రి జిల్లా భూదాన్​ పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్​తో పాటు పలు అభివృద్ధి పనులకు కేటీఆర్​ శనివారం శంకుస్థాపన చేశారు.

నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం  చేనేత వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​ రైతు రుణమాఫీ చేస్తారని ఎవరూ ఊహించలేదని, ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారు కాబట్టి రుణాలు మాఫీ చేస్తున్నారని తెలిపారు.  తమ ప్రభుత్వం చేనేత మిత్ర, బీమా, నేతన్నకు చేయూత వంటి స్కీమ్​లను అమలు చేస్తున్నదని అన్నారు. చేనేత హెల్త్​ కార్డు ద్వారా కార్మికుల ఓపీ సేవల కోసం రూ.25 వేలు  ఇస్తున్నామని,  దహన సంస్కారాల కోసం రూ. 25 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గుంట మగ్గాల స్థానంలో రూ.40 కోట్లతో ఫ్రేమ్ లూమ్స్​తీసుకొస్తున్నామని ప్రకటించారు. 

ఉప్పల్​ భగాయత్​లో హాండ్లూమ్​  మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. కనుముక్కులలో మూతపడిన పోచంపల్లి హాండ్లూమ్​ పార్కును ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి వినతి మేరకే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, త్వరలోనే దాన్ని  ఓపెన్​ చేస్తామని చెప్పారు.  చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించే పలు బోర్డులను ప్రధాని మోదీ రద్దు చేశారని, చేనేత ఉత్పత్తులపై  5 శాతం జీఎస్టీ విధించారని ఆరోపించారు. మోదీ ఉంటే జీఎస్టీ అలాగే ఉంటుందన్నారు. కోకాపేటలో రూ.250 కోట్ల విలువైన రెండున్నర ఎకరాల స్థలం ఇచ్చామని, రూ.5 కోట్లతో భవనాలు నిర్మిస్తామని, కొండా లక్ష్మణ్​ బాపూజీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరు కోరితే సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని కేటీఆర్​ ప్రకటించారు.

కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే 

'వచ్చే లోక్​సభ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. అందులో మనం ఉంటాం. మనం చెప్పినోళ్లే ప్రధాని అవుతరు' అని  కేటీఆర్​ తెలిపారు.  మన బలం లేకుండా, దీవెన లేకుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉండదని అన్నారు. మోదీ ఆడిచ్చినట్టు ఆడే డూడూ బసవన్నలు, ఢిల్లీ బానిసలైన బీజేపీ, కాంగ్రెస్​ ఉన్నంత కాలం పరిస్థితులు మారవని దుయ్యబట్టారు. కేంద్రంతో కొట్లాడి  శాసించి, మెడలు వంచాలంటే కేసీఆర్​తోనే సాధ్యమన్నారు. తెలంగాణలో బీఆర్​ఎస్​ మరోసారి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కేసీఆర్​ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు.  అలాగే, వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యేగా మళ్లీ పైళ్ల శేఖర్​రెడ్డినే గెలిపించాలని కేటీఆర్​ కోరారు. 

నిజాం కాలేజీ అభివృద్ధికి అండగా ఉంటా

బషీర్​బాగ్, వెలుగు: తాను చదువుకున్న నిజాం కాలేజీ అభివృద్ధికి అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం ఆయన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎల్ రమణతో కలిసి కాలేజీలో నూతన క్లాస్ రూమ్ కాంప్లెక్స్,  బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణానికి హెచ్ఎండీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖల నుంచి  రూ.18.75 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇంకా నిధులు అవసరమైతే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్య అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్​ తెలిపారు. ఉద్యమాల కేంద్రం అయిన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి కూడా అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. 

దేశాన్ని దోచుకున్న తోడు దొంగలే.. కాంగ్రెస్, బీజేపీ

హైదరాబాద్, వెలుగు: 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశాన్ని దోచుకున్న తోడు దొంగలే కాంగ్రెస్, బీజేపీ అని మంత్రి కేటీఆర్​ఫైర్​ అయ్యారు. ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్​కమిటీ, బీజేపీ అంటే భ్రష్టాచార్​జనతా పార్టీ అని ట్విట్టర్​వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ పార్టీలే.. అసమర్థ పాలనకు కేరాఫ్.. అవినీతి ప్రభుత్వాలకు చిరునామా.. మీ దశాబ్దాల పాలనా వైఫల్యాల పాపమే దేశానికి, రాష్ట్రానికి శాపమై ఇంకా వెంటాడుతూనే ఉంది..” అని ట్వీట్​ చేశారు. తమను నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే ఎంఐఎం భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే కుతంత్రానికి కాంగ్రెస్​తెరదీసిందని ఫైర్​ అయ్యారు. వెన్నుపోటు వారసుడిని నమ్ముకుని కాంగ్రెస్ వెన్నుముక లేని పార్టీగా మిగిలిపోయిందని, ఆ పార్టీ ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని కేటీఆర్​ పేర్కొన్నారు.