సౌత్​లో కేసీఆరే మూడోసారి సీఎం

సౌత్​లో కేసీఆరే మూడోసారి సీఎం
  • ఇంతవరకు ఎవరూ అట్ల హ్యాట్రిక్​ కొట్టలే
  • కేసీఆర్​ మాత్రం సరికొత్త రికార్డు సృష్టిస్తరు: కేటీఆర్
  • ధీమా వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్​
  • కామారెడ్డిలో ఇండోర్​ స్టేడియం పనులకు శంకుస్థాపన

కామారెడ్డి, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే హ్యాట్రిక్​ సీఎంగా కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని మంత్రి కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. సౌత్​ ఇండియా నుంచి ఎంజీఆర్,  ఎన్టీఆర్, కరుణానిధి లాంటి  పెద్దలు సీఎంలుగా ఉన్నా ఎవరూ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి కాలేదని అన్నారు.  అయితే.. కేసీఆర్​ మాత్రం హ్యాట్రిక్​ కొట్టి రికార్డు సృష్టిస్తారని, దానికి కామారెడ్డి వేదిక అవుతుండటం గర్వకారణమని చెప్పారు. ఈసారి కేసీఆర్​  గజ్వేల్​తో  పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయనుండటంతో శనివారం కామారెడ్డిలో కార్యకర్తల మీటింగ్​ఏర్పాటు చేశారు. రూ. 8 కోట్లతో  నిర్మించనున్న  ఇండోర్​స్టేడియం పనులకు మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డితో కలిసి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్​ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ఎక్కడ అడుగు పెట్టిన విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కేసీఆర్​పోటీ 
చేస్తానని ప్రకటించిన మరుక్షణమే ఆయన గెలుపు ఖాయమైంది. 

దేశ చరిత్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఏ నేతకు రానంత మెజార్టీని కామారెడ్డిలో కేసీఆర్​కు అందించాలి. గంప గోవర్ధన్​కు ఎమ్మెల్యే కంటే పెద్ద హోదా దక్కవచ్చు” అని అన్నారు. ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో  రాజకీయ సమీకరణాల వల్ల  ముదిరాజ్​లకు అన్యాయం జరిగిందని, ప్రాతినిధ్యం విషయంలో వచ్చిన  గ్యాప్​ను  సవరించుకుంటామన్నారు. ముదిరాజ్​సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్​మండలిలో డిప్యూటీ చైర్మన్​గా, ఎమ్మెల్సీగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేలుగా అవకాశం రాని ముదిరాజ్​లకు, ఇతర కమ్యూనిటీలకు ఎమ్మెల్సీ, నామినేటెడ్​ పదవుల్లో తప్పకుండా అవకాశం కల్పిస్తామన్నారు. కామారెడ్డిలో ముదిరాజ్ ​భవన్​కు రూ. 2 కోట్లు శాంక్షన్​ చేస్తున్నామని చెప్పారు.

బీజేపీలోకి  రేవంత్​ జంపైతడు

కాంగ్రెస్​ నుంచి 10 , 12 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే  రేవంత్​రెడ్డి బీజేపీలోకి జంపు అవుతారని కేటీఆర్​ ఆరోపించారు. ‘‘రేవంత్​రెడ్డిని గాంధీ భవన్​లో  కూర్చోబెట్టింది ఆర్​ఎస్​ఎస్​, బీజేపీవాళ్లే. వీరి మధ్య తేరచాటు, చీకటి ఒప్పందం ఉంది. కాంగ్రెస్​ చచ్చిన పీనుగు.. దానికి దింపుడు కల్లం ఆశ ఉంది. కాంగ్రెస్​, బీజేపీ వాళ్లను తక్కువ అంచనా వేయొద్దు. కేసీఆర్​ లాంటి నాయకుడు ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్​రెడ్డితో,  రాష్ట్ర ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్​రెడ్డితో పోరాడాల్సి వస్తున్నది. రేవంత్​రెడ్డి, కిషన్​రెడ్డి  ఉద్యమ ద్రోహులు” అని ఆయన దుయ్యబట్టారు. 

కామారెడ్డిలో గ్రామానికో మేనిఫెస్టో

కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామానికి ఓ మేనిఫెస్టో తయారు చేయాలని లీడర్లకు కేటీఆర్​ సూచించారు. ‘‘సీఎం నియోజకవర్గమంటే మజాక్ ​కాదు. నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తం. ఏ గ్రామానికి ఏం కావాల్నో నాకు ఇవ్వండి. నేను, గోవర్దన్​, ప్రశాంత్​రెడ్డి బాధ్యత తీసుకొని ఆ పనులు చేస్తం” అని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 266 బూత్​ల్లో ఒక్కోదానికి  ఒక్కో  సీనియర్​లీడర్​ను  ఇన్​చార్జ్​గా నియమిస్తామని చెప్పారు. బూత్​ కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. మెజార్టీ కోసం ఏ బూత్​కు ఆ బూత్​పోటీ పడాలన్నారు. కామారెడ్డికి తనతో పాటు మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ఇన్​చార్జ్​గా ఉంటారని కేటీఆర్​ తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఏం జరగబోతున్నదని మహారాష్ట్ర చూస్తున్నదని ఆయన అన్నారు. ‘‘తెలంగాణలో గెలవాలి. రేపు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్​పాగా వేయాలి. ఆ తర్వాత జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలి. తెలంగాణలో మనం గెలిస్తేనే మహారాష్ట్రలో గెలవడానికి వీలుంటుంది. మహారాష్ట్రకు చెందిన చాలా మంది సిట్టింగ్​ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు బీఆర్​ఎస్​లో చేరడానికి రెడీగా ఉన్నరు. ఇక్కడి 24 గంటల కరెంట్, రైతుబంధు, దళిత బంధు స్కీమ్​ల దృష్ట్యా మన వైపు మహారాష్ట్ర చూస్తున్నది” అని తెలిపారు.