మోదీ బెదిరింపులకు భయపడం : కేటీఆర్​

మోదీ బెదిరింపులకు భయపడం : కేటీఆర్​
  • తెలంగాణ నుంచి బీజేపీని ప్రజలు తరిమేస్తరు
  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కుటుంబ పార్టీ మాది
  • అవాకులు, చెవాకులు పేలడం ప్రధానికి పరిపాటైంది
  • ఆయనలా అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి
  • రాష్ట్రానికి అడుగడుగునా కేంద్రం అన్యాయం చేస్తూనే ఉంది
  • కాజీపేటకు కోచ్​ ఫ్యాక్టరీ అడిగితే.. రిపేర్​ షాప్​ ఇచ్చారని విమర్శ

హైదరాబాద్, వెలుగు: మోదీ బెదిరింపులకు, కేంద్ర ఏజెన్సీలకు భయ పడే ప్రసక్తే లేదు. ఇలాంటి ఉడుత ఊపులు, పిట్ట బెదిరింపులకు కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం మాది కాదు” అని మంత్రి కేటీఆర్​ అన్నారు. ప్రధాని పర్యటన మొత్తం ఆత్మవంచన, పరనింద అన్నట్టుగా సాగిందని విమర్శించారు. కుటుంబ పాలన, అవినీతిపై ప్రధాని వ్యాఖ్యలు చేయడం దెయ్యాలు వేదాలు వళ్లించిన్నట్లుగా ఉందని కామెంట్​ చేశారు. ‘‘అనేక రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులు వారసత్వ రాజకీయాల్లో ఉన్నరు. మోదీ కేబినెట్​లోనూ రాజకీయ వారసులు ఉన్నరనే విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్న కుటుంబ పార్టీ మాది” అని ఆయన తెలిపారు. కేసీఆర్ పాలనపై శనివారం వరంగల్ ​సభలో మోదీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్​ఒక ప్రకటనలో ఖండించారు. మోదీ ప్రసంగం మొత్తం అసత్యాలతోనే సాగిందని దుయ్యబట్టారు.

రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి తమ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడటం మోదీకి పరిపాటిగా మారిందన్నారు. తెలంగాణకు ఏమిచ్చారో చెప్పకుండా ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోయారని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉందని ఆరోపించారు. ‘‘తెలంగాణపై నిరంకుశ వైఖరి అవలంబిస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తన్ని తరిమేస్తరు” అని హెచ్చరించారు. కాజీపేట కోచ్​ఫ్యాక్టరీ 45 ఏండ్ల డిమాండ్​అని, దాని స్థానంలో రిపేర్​ షాప్​ఏర్పాటు చేసి ఏదో గొప్ప మేలు చేసినట్టుగా చెప్పుకుంటున్నారని, ఇది రాష్ట్ర ప్రజలను అవమానించ డమేనని కేటీఆర్​ అన్నారు. ‘‘తెలంగాణ ప్రజల డిమాండ్​ను మోదీ పట్టించుకోలేదు. తన సొంత రాష్ట్రం గుజరాత్​కు లోకోమోటివ్ ​ఫ్యాక్టరీ తరలిం చుకుపోయారు. సబ్​కా సాత్.. సబ్​కా వికాస్​ అనే నినాదం.. గుజరాత్​కా సాత్, గుజరాత్​ కా వికాస్​అన్నట్టుగా మారింది. బయ్యారం స్టీల్​ప్లాంట్, ఆదిలాబాద్ ​సిమెంట్ ​కార్పొరేషన్ ​ఆఫ్​ఇండియా పున:ప్రారంభం, నేషనల్ ​హైవేస్, కొత్త రైల్వే స్టేషన్లు, లైన్​ల బలోపేతం సహా అనేక డిమాండ్లను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు” అని మండిపడ్డారు. 

స్టేట్​లో జాబ్స్​ గురించి మాట్లాడటం విడ్డూరం

‘‘దేశంలోని యువత ఈ గెల్డెన్ ​పీరియడ్​ను వినియోగించుకోవాలని చెప్తున్న మోదీ.. 9 ఏండ్లలో యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా చెప్తే బాగుండేది. దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యో గం పెంచారు. ఆయన అసమర్థ పాలనపై ప్రశ్నిస్తే పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనని హేళన చేశారు” అని కేటీఆర్​ దుయ్యబట్టారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని, అలాంటిది రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ గురించి మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం 2.20 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని కేటీఆర్​ తెలిపారు. రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్​ను మోదీ ప్రభుత్వమే రద్దు చేసిందని మండిపడ్డారు. వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి తాము చట్టం చేస్తే గవర్నర్ ​తొక్కి పెట్టారని, దానిపై ప్రధాని స్పందిస్తే బాగుండేదని కేటీఆర్ ​కామెంట్​ చేశారు.

తమను ప్రశ్నించే ముందు సెంట్రల్ ​యూనివర్సిటీల్లోని ఖాళీలను ముందు భర్తీ చేయాలన్నారు. ఒక్కో గురుకుల విద్యార్థిపై తమ ప్రభుత్వం ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ‘‘మోదీలా అనర్గళంగా అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి” అని విమర్శించారు. ‘‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల మరణాలకు కారకుడయ్యారు.  వ్యవసాయ సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్న విషయం తెలుసుకోవాలి. తన కార్పొరేట్​మిత్రులకు రూ.12.50 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేసిన ప్రధా ని.. రైతురుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదు?” అని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘‘ట్రైబల్​యూనివర్సిటీ ఇవ్వని ప్రధాని ఆదివాసీల సంక్షేమం గురించి మాట్లాడం విడ్డూరంగా ఉంది” అని అన్నారు.