వరంగల్ పై కేటీఆర్ ఫోకస్..రేపు మరోసారి జిల్లాకు

వరంగల్ పై కేటీఆర్ ఫోకస్..రేపు మరోసారి జిల్లాకు

హనుమకొండ, వెలుగు: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ఓరుగల్లుపై ఫోకస్​పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస టూర్లు చేపడుతూ ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్​వర్క్స్ తో పాటు కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. గడిచిన నెల రోజుల్లో ఇప్పటికే రెండుసార్లు ఉమ్మడి జిల్లాకు వచ్చిన ఆయన రేపు హనుమకొండ జిల్లా పరిధి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.150 కోట్ల విలువైన వివిధ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మరో వారం, పది రోజుల్లో వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకూ వచ్చి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్​ యాక్టివిటిస్​పెరుగుతుండటంతో నేతల్లో ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఈనెల 27న మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​రెడ్డి ఇలాకా హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో పర్యటిస్తారు. అక్కడే 30 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పల్లా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఎమ్మెల్సీ పల్లా విజ్ఞప్తి మేరకు...

ఎగువ ప్రాంతం వేలేరు మండలంలో కొన్ని గ్రామాలకు సాగునీరు అందకపోవడంతో ఇక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు, బావులతో పంటలు సాగు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి విజ్ఞప్తి మేరకు గతంలో సీఎం కేసీఆర్​ ఇక్కడి రైతులకు సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు దేవాదుల ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.103 కోట్లతో మూడు చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో గండిరామారం రిజర్వాయర్ వద్ద ఒకటి, అక్కడి నుంచి కన్నారం, కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి వరకు పైపులైన్, రెండోది గుండ్లసాగరం వద్ద, అక్కడి నుంచి లోక్యతండా, బండతండా, మాటుతండా, కమ్మరిపేట, ముప్పారం, నారాయణగిరి గ్రామాలకు పైపులైన్, నష్కల్​-ఉప్పుగల్లు మధ్యలో మూడో లిఫ్ట్​ ఏర్పాటు చేసి వంగాలపల్లి, మల్లక్​ పల్లి, ధర్మపురం గ్రామాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు లిఫ్ట్ లకు మంత్రి కేటీఆర్​శంకుస్థాపన చేయనున్నారు.