పొన్నాలకు బీఆర్ఎస్లో సముచితమైన స్థానం కల్పిస్తాం : కేటీఆర్‌

పొన్నాలకు బీఆర్ఎస్లో  సముచితమైన స్థానం కల్పిస్తాం : కేటీఆర్‌

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను  బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.  హైదరాబాద్ లోని పొన్నాల ఇంటికి వెళ్లిన  కేటీఆర్..  ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.  సీఎం కేసీఆర్ సూచన మేరకే పొన్నాల ఇంటికి వచ్చానని తెలిపారు.  

 పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని,  ఆయన కూడా  పార్టీలో చేరేందుకు సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.  2023 అక్టోబర్  15 న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో పొన్నాల భేటీ అవుతారని  అన్నారు.  భేటీ అనంతరం పొన్నాల తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.  

ఆక్టోబర్ 16వ తేదీన జనగామ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో  బీఆర్ఎస్ లో చేరాలని పొన్నాలను కోరినట్లుగా కేటీఆర్ తెలిపారు.  పొన్నాలకు పార్టీలో గౌరవించి సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.  జనగామ బీఆర్ఎస్ టికెట్ పొన్నాలకు ఇస్తారా అన్న ప్రశ్నకు.. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.  

కాగా 2023 అక్టోబర్ 13 న కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  తన రాజీనామా లేఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు.  ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు.  బజారులో టికెట్లు అమ్ముకున్నట్లు అమ్ముతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీని వీడారు.  

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా,  మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం పొన్నాలకు ఉంది.   తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నా యి. ఈ క్రమంలో పొన్నాల పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది.  

ALSO READ : ఇలా చేస్తే కళ్లు రిఫ్రెష్ అవుతాయి.. ఒత్తిడి, అలసట చిటికెలో మాయం