నిత్యం సచివాలయానికి కేసీఆర్.. ప్రగతిభవన్ లోనే కేటీఆర్ రివ్యూలు

నిత్యం సచివాలయానికి కేసీఆర్.. ప్రగతిభవన్ లోనే కేటీఆర్ రివ్యూలు

కొత్త సెక్రటేరియట్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతానికైతే రెగ్యూలర్ గానే వెళ్తున్నారు. దాదాపు మంత్రులందరూ కొత్త సెక్రటేరియట్ లోనే తమ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కు వచ్చే సమయానికి..పేషీల్లో ఉండేలా మంత్రులందరూ ప్లాన్ చేసుకుంటున్నారట. మంత్రి కేటీఆర్ మాత్రం సెక్రటేరియట్ కు వెళ్లడం లేదట. సెక్రటేరియట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఒకటి, రెండు సార్లు మాత్రమే కేటీఆర్ అక్కడకు వెళ్లారట. తన శాఖ అధికారులను నేరుగా ప్రగతిభవన్ కే పిలిపించి... రివ్యూలు చేస్తున్నారట కేటీఆర్. 

సీఎం కేసీఆర్ పాత ఫార్మాట్ నే ఇప్పుడు కేటీఆర్ ఫాలో అవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పాత సెక్రటేరియట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉండిపోయారు. కేబినెట్ సమావేశమైనా, రివ్యూలైనా...అన్నీ ప్రగతి భవన్ లోనే జరిగేవి. ఇప్పుడు కేసీఆర్ రూట్ లోనే ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ వెళ్తున్నారనే చర్చ నడుస్తోంది. కొత్త సెక్రటేరియట్ కు వెళ్లకుండా అన్నీ పనులను ప్రగతి భవన్ లో నిర్వహిస్తున్నారట. అధికార కార్యక్రమాలైనా, పార్టీ కార్యక్రమాలైనా ప్రగతి భవన్ లోనే అధికారులతో చర్చిస్తున్నారట కేటీఆర్.

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో పాలనా వ్యవహారాలు నడిపించినప్పుడు.. కేటీఆర్ బంజారాహిల్స్ NBT నగర్ లోని పాత ఇంటిలోనే ఎక్కువగా ఉండేవారు. అక్కడి నుంచే అధికారిక కార్యక్రమాలు నడిపించేవారు. పార్టీ నేతలైనా పాత ఇంటిలోనే కేటీఆర్ ను కలిసేవారు. ఇప్పుడు సీన్ మారిపోయిందంట. ఇప్పుడు ఎక్కువగా ప్రగతిభవన్ లోనే కేటీఆర్ ఉంటున్నారట. ఆయనను కలవడానికి వచ్చే వాళ్లను ప్రగతిభవన్ కే పిలుపించుకుంటున్నారట. అధికారులైనా, పార్టీ  లీడర్లైనా..ఇతర డెలిగేట్స్ ఎవరైనా సరే కేటీఆర్ ను కలవాలంటే ప్రగతి భవన్ కు వెళ్లాల్సిందేనంట. 

ఇప్పుడు పార్టీ నేతలకు ఓ క్లారిటీ వచ్చిందంట. సీఎం కేసీఆర్ ను కలవానుకునేవాళ్లు సెక్రటేరియట్ కు, కేటీఆర్ ను కలవాలనుకునేవాళ్లు ప్రగతిభవన్ కు వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్తుండడంతో.. కేటీఆర్ అనుచరులతో ప్రతిభవన్ కిటికిటలాడుతుందట.