సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్కు సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మరో మణిహారం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితమైన, ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్ట్ ట్రాన్స్ పోర్టు సొల్యూషన్ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ  సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇది మొట్టమొదటి సోలార్ రూఫ్ సైకిలింగ్ ట్రాక్ అని చెప్పారు. స్థానికంగా ఉండే వ్యక్తులు  ఆఫీస్కు సైకిల్పై వేళ్లేందుకు ఉపయోగపడాలని ముఖ్య ఉద్దేశంతో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దుబాయ్, జర్మనీ లాంటి విదేశాల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేసి సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ వద్ద సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,  శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. 

ఫస్ట్ ఫేజ్లో 23 కి.మీ

ఫస్ట్ ఫేజ్లో 23 కిలోమీటర్ల పాటు సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.  ఇప్పటికే 50 మీటర్ల పాటు మోడల్ డెమో కింద ట్రాక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 4.5 మీటర్ల వెడల్పుతో ట్రాక్ ఏర్పాటవుతుందన్నారు. ట్రాక్తో పాటు..సోలార్ రూఫ్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా 16 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందన్నారు. ట్రాక్ వెంబడి సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు, ఫుడ్ కోర్టులు, టాయిలెట్స్, రిపేర్ స్టేషన్లు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, సైకిల్ రెంటల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎండాకాలంలోగా ఈ ట్రాక్ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఇందులో భాగంగా రెండవ దశలో గండిపేట చుట్టూ..సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతగిరిలో 275 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెల్ నెస్ సెంటర్తో పాటు.. ఆ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్గా  అభివృద్ధి చేయబోతున్నామన్నారు. జీహెచ్ఎంసీలోనూ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

టీఎస్‌ రెడ్‌కో ఆధ్వర్యంలో..

టీఎస్‌రెడ్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న సైక్లింగ్ ట్రాక్..మొదటి దశలో మొత్తం 23 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో భాగంగా నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు... నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ ట్రాక్‌ ను  నిర్మించనున్నారు. సోలార్ రూఫ్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఔటర్‌పై ఉండే వీధిదీపాలు, ఇతర అవసరాలకు వాడుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.