సింగరేణి జోలికొస్తే ఢిల్లీకి సెగతగుల్తది

సింగరేణి జోలికొస్తే ఢిల్లీకి సెగతగుల్తది

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని దెబ్బతీసే కుట్రలు చేస్తే బీజేపీ దెబ్బతినడం ఖాయమని, సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లెటర్​ రాశారు. లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేట్​పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ‘‘నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్రం ఇప్పుడు సింగరేణిపై కుతంత్రాలు చేస్తున్నది. సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం. జేబీఆర్ఓసీ – 3, కేకే –6, శ్రవణ్పల్లి ఓసీ, కోయగూడెం బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుండా, వేలానికి పెట్టడం, వాటి వేలంలో పాల్గొనాలని నిర్దేశించడం సరికాదు. సంస్థ బలోపేతానికి కొత్త బ్లాకులు కేటాయించాల్సింది పోయి, సింగరేణి పరిధిలో ఉన్న వాటిని ఎలా వేలం వేస్తారు” అని  ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి లాభాల్లో దూసుకుపోతున్నదని, సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పీఎల్ఎఫ్ ను కలిగి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ స్టేషన్లకు బొగ్గు సరఫరా చేస్తున్న ఇతర రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. 

అది తెలంగాణ యువతకు గోల్డ్​మైన్​
కార్మికులకు లాభాల్లో 29 శాతం వాటా ఇస్తున్న ఒకే ఒక సంస్థ సింగరేణి అని కేటీఆర్​ పేర్కొన్నారు. ‘‘గుజరాత్ ప్రభుత్వం అడిగితే లిగ్నైట్ గనులను వేలం వేయకుండా ఆ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం కోరినా బొగ్గు గనులు వేలం విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నది. సింగరేణి సంస్థ కేవలం కోల్ మైన్ కాదు.. తెలంగాణ యువత పాలిట గోల్డ్ మైన్” అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో కొత్తగా 16 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. సింగరేణిని క్రమేణ ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు కార్మిక కుటుంబాలకు దొరికే అవకాశం ఉండదని, భవిష్యత్తులో ఈ సంస్థ కనుమరుగైపోయే ప్రమాదముందని చెప్పారు. బొగ్గు బ్లాకుల వేలంపై వెనక్కి తగ్గకుంటే కార్మికులు ఉక్కు పిడికిలి బిగించి బీజేపీని వెంటపడి తరమడం ఖాయమని కేటీఆర్​ హెచ్చరించారు. ఇప్పటికైనా బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రిని లెటర్​లో ఆయన కోరారు.

For more news..

ప్రైవేట్ కంపెనీలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలి

నేను ఫ్రీ బర్డ్.. స్వేచ్ఛగా బతుకుతా