
- పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ ప్లేస్
హైదరాబాద్, న్యూఢిల్లీ, వెలుగు: డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సీఐఐ, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (ఎస్‌ఐడీఎం) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఈకో సిస్టం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో వెయ్యికిపైగా ఎంఎస్‌ఎంఈలు పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌కు మిసైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరుందని, డీఆర్‌డీవో, బెల్, హాల్ సహా అనేక రక్షణరంగ సంస్థలు ఇక్కడే ఉన్నాయని గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచంలోనే దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ సహా అనేక దేశాలకు చెందిన ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఓఈఎం), లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ లాంటి సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టాయన్నారు.
రాష్ట్రంలో ఎన్నో సౌలత్లున్నయ్..
డిఫెన్స్ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్‌తో సులభంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. 24 గంటల కరెంట్, నైపుణ్యం గల మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టీహబ్, వీహబ్, టీ వర్క్స్ లాంటి సంస్థలతో హైదరాబాద్‌లో బలమైన ఇన్నోవేషన్ ఈకో సిస్టం ఉందన్నారు.
ఆదిభట్ల, నాదర్‌గుల్, జీఎంఆర్ ఏరోస్పేస్, హార్డ్‌వేర్ పార్క్, ఈ - సిటీ, ఇబ్రహీంపట్నంలో ఏరోస్పేస్, డిఫెన్స్ కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్‌లు ఉన్నాయని వివరించారు. బోయింగ్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐడెక్స్ ఇంక్యుబేషన్ ఇక్కడ చేపడుతున్నాయని, ఇన్ని సానుకూల సౌకర్యాలున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని డిఫెన్స్ కంపెనీలను ఆహ్వానించారు.