TSPSC : పేపర్ లీకేజీ వ్యక్తులు చేసిన తప్పు.. వ్యవస్థది కాదు : కేటీఆర్

TSPSC : పేపర్ లీకేజీ వ్యక్తులు చేసిన తప్పు.. వ్యవస్థది కాదు : కేటీఆర్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని వివరించారు మంత్రి కేటీఆర్. టీఎస్ పీఎస్సీ చైర్మన్, నలుగురు మంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత.. సీఎం కేసీఆర్ మాటగా.. మార్చి 18వ తేదీ శనివారం..  సమావేశం వివరాలను మీడియాకు వివరించారు మంత్రి కేటీఆర్. వీళ్లిద్దరే కాకుండా లీకేజీ కేసులో ఇంకెవరు ఉన్నా.. అందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని.. వ్యవస్థ చక్కగా ఉందని వివరించారు కేటీఆర్. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని.. 37 వేల ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయటం జరిగిందన్నారు.  టీఎస్ పీఎస్సీ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత సాధించిందన్నారాయన. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్ పీఎస్సీ గుర్తింపు పొందిందని.. కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే  ఓటీఆర్.. వన్ టైం రిజిస్ట్రేషన్ తీసుకు రావటం జరిగిందన్నారు. డిజిటల్ చెల్లింపులు.. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే అని వివరించారు మంత్రి కేటీఆర్. 99 పరీక్షలను నిర్వహించటం ద్వారా.. నాలుగున్నర లక్షల మంది స్టూడెంట్స్ హాజరయ్యారని వివరించారాయన. 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు.. రెండు సార్లు తెలంగాణకు వచ్చి టీఎస్ పీఎస్సీపై అధ్యయనం చేశారని.. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వచ్చి పరిశీలించి.. అధ్యనం చేసి.. ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారని వెల్లడించారు మంత్రి కేటీఆర్.  దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ గా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్తింపు పొందిందని స్పష్టం చేశారాయన. 28 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా.. ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే అన్నారు కేటీఆర్.