హైదరాబాద్​లో 70 వేల ఇండ్లు పంచుతం : కేటీఆర్

హైదరాబాద్​లో 70 వేల ఇండ్లు పంచుతం : కేటీఆర్
  • వచ్చే వారంలోనే పంపిణీ ప్రారంభిస్తం
  • ఐదారు దశల్లో అందరికీ అందజేస్తమని వెల్లడి

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​లో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే వారంలోనే పంపిణీ ప్రారంభించి, ఐదారు దశల్లో పూర్తి చేస్తామని చెప్పారు. గ్రేటర్​లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై బుధవారం ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అధికారులు పాల్గొన్నారు. గ్రేటర్​లో 70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, లబ్ధిదారుల ఎంపిక కూడా దాదాపు పూర్తి కావొచ్చిందని మంత్రులకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్ లో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నం. 

ఇప్పటికే 75 వేలకు పైగా ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ఇందులో 4,500కు పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందజేశాం” అని చెప్పారు. మిగతా వాటిని కూడా లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించారు. కాగా, ఇండ్ల పంపిణీ ప్రక్రియపై మంత్రులు పలు సూచనలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులను గుర్తిస్తోందని చెప్పారు. గృహలక్ష్మీ పథకంపైనా ఈ సమావేశంలో చర్చించారు.