కేసీఆర్ పుణ్యంతోనే దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం

కేసీఆర్ పుణ్యంతోనే దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం

బాగ్ అంబర్‌‌పేట్: హరితహారంతో దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బాగ్ అంబర్‌ పేట్‌లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హరితహారాన్ని మించిన ఉదాత్తమైన, గొప్ప కార్యక్రమం మరొకటి లేదన్నారు. కరోనా రెండో దశతో దేశం అల్లాడిపోయిందని.. ఆక్సిజన్ అందక, సరిపడక చాలా ప్రాణాలు పోవడం కలచివేసిందన్నారు. భవిష్యత్ కోసం పుడమిని కాపాడుకునేందుకు అందరమూ సమిష్టిగా పని చేయాలన్నారు. రూ.5,900 కోట్ల వ్యయంతో 220 కోట్ల మొక్కలు నాటి ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

‘తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. హెచ్ఎండీఏ పరిధిలో 650 కోట్లతో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలకంగా మారతాయి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉండేది చెట్టు మాత్రమే. పచ్చదనం పెరిగేలా చట్టాలలో కఠినమైన నిబంధనలు పెట్టారు. 85 శాతం మొక్కలు బతక్కపోతే స్థానిక ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించే నిబంధనలు పెట్టారు. మన పిల్లలు, భవిష్యత్ తరాల కోసం బతకాలన్న సోయి అందరికీ రావాలి. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పచ్చదనాన్ని 33 శాతానికి చేర్చాలన్న కేసీఆర్ కల నెరవేరి దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శరాష్ట్రంగా తెలంగాణ ఎదగాలి. మన ముఖ్యమంత్రి పుణ్యంతో దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల స్పూర్తితో కేంద్రం నగరవన్ కార్యక్రమాన్ని చేపట్టింది’ అని కేటీఆర్ చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలిపినందుకు అటవీశాఖకు అభినందనలు తెలిపారు.