తెలంగాణపై మోదీది సవతి తల్లి ప్రేమ : కేటీఆర్

తెలంగాణపై మోదీది సవతి తల్లి ప్రేమ : కేటీఆర్

వరంగల్ : కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కొంతమంది కాపీ కొడుతున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజల పోరాటంతోనే కాంగ్రెస్ , బీజేపీలు దిగి వచ్చి తప్పక తలవంచి రాష్ట్రం ఇచ్చారని అన్నారు. తెలంగాణపై ఈ రెండు పార్టీలకు ప్రేమలేదన్నారు. తప్పని పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు తెలంగాణ జపం చేస్తున్నాయని ఆరోపించారు. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

నరేంద్ర మోదీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. 60 ఏళ్లు ఆగం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మాయమాటలు చెబుతోందన్నారు. కాంగ్రెస్ వాళ్లు కరెంట్ గురించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వంద బస్సులు పెట్టి.. ఖర్చులు కూడా భరిస్తామని.. ఆ బస్సుల్లో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏ ఊరికైనా వెళ్లండి అంటూ మంత్రి కేటీఆర్  సవాల్ విసిరారు. అందరూ అక్కడ ఉన్న కరెంట్ వైర్లు పట్టుకుంటే కరెంటు వస్తోందో రాదో తెలుస్తుందని, అప్పుడు గానీ.. దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఎన్ని చాన్సులు ఇచ్చినా ఫలితముందా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే పెన్షన్ పెంపుపై ప్రకటన చేస్తారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా కిషన్ రెడ్డి అమెరికా పారిపోయారని ఆరోపించారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచిన మోదీ ప్రజలకు దేవుడా..? అని ప్రశ్నించారు. రూ.15 లక్షలు వచ్చిన వాళ్లు బీజేపీకే ఓటేయండి.. తెలంగాణ సంక్షేమ పథకాలు పొందిన వాళ్లు బీఆర్ఎస్​ కు ఓటేయండి అని చెప్పారు.