కాంగ్రెసోళ్లు చేతగాని, చేవలేనోళ్లు: కేటీఆర్

కాంగ్రెసోళ్లు చేతగాని, చేవలేనోళ్లు: కేటీఆర్
  •  ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోలేని స్కీంలు ఇక్కడున్నయ్: కేటీఆర్  
  • అభివృద్ధిని ఓర్వలేకే ఎలక్షన్ల టైంకు ఎగబడ్తున్నరు 
  • ములుగులో దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి

ములుగు, వెలుగు: కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ నేతలు చేతగాని, చేవలేనివాళ్లు అని ఆయన విమర్శించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలోనే చేసి చూపించారన్నారు. ములుగులోని డిగ్రీ కాలేజీ సమీపంలో నిర్మిస్తున్న కలెక్టరేట్, మినీ బస్ డిపో, మోడల్ పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీసు తదితర అభివృద్ధి పనులకు హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్​తో కలిసి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘సాగునీటి దినోత్సవం’ సభలో ఆయన మాట్లాడారు. ములుగు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కాకపోయినా ప్రజలపై ప్రేమతో సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ఊర్లకు రోడ్లు కూడా ఉండేవి కావన్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పక్కన ఉన్న చత్తీస్​గఢ్ లో ధాన్యం సేకరణకు కటాఫ్ ఉంటుందని, మద్దతు ధర ఉండదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో లేని స్కీంలు ఇక్కడ అమలవుతున్నాయని చెప్పారు. 

ములుగు జిల్లాలో మరో 67 జీపీలు..  

ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న పాలన కోసం రాష్ట్రంలోని 3100 తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలు (జీపీలు) గా ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. ములుగు జిల్లాలో మరో 67 కొత్త జీపీలు ఏర్పాటు చేస్తామన్నారు. ములుగును మున్సిపాలిటీగా చేశామని, మల్లంపల్లిని కూడా మండలంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు జూన్ చివరి వారంలో పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు. జిల్లాలోని 17 వేల ఎకరాల్లోని పోడు రైతులకు పట్టాలు జారీ చేస్తామని తెలిపారు. అన్నీ చూసి కూడా ఇక్కడి ఎమ్మెల్యే అభివృద్ధి ఏదీ? అని సన్నాయి నొక్కులు నొక్కడం దారుణమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై విమర్శలు చేశారు. అయితే, ములుగు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా ప్రజలు గెలిపించుకుంటారంటూ జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతిని చూపిస్తూ మంత్రి కామెంట్ చేయడం చర్చనీయాంశం అయింది. కాగా, ఈ అధికారిక కార్యక్రమానికి సీతక్క గైర్హాజరయ్యారు.