రాష్ట్రంలో కొలువుల కుంభమేళా నడుస్తున్నది: మంత్రి కేటీఆర్​

రాష్ట్రంలో కొలువుల కుంభమేళా నడుస్తున్నది: మంత్రి కేటీఆర్​
  • ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో దేశానికి తెలంగాణ రోల్​ మోడల్​
  • కేసీఆర్‌‌ ఆశయానికి తగ్గట్టుగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతది
  • కష్టపడి చదివి కలల్ని నిజం చేసుకోవాలని యువతకు బహిరంగ లేఖ

 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కొలువుల కుంభమేళా నడుస్తున్నదని, హామీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్‌‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌‌ నాయకత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే తెలంగాణ రోల్‌‌ మోడల్‌‌గా నిలిచిందని ఆయన అన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తూ నవశకానికి నాంది పలికిందని పేర్కొన్నారు.  తొమ్మిదేండ్లలోనే 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా సరికొత్త చరిత్ర లిఖించబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆదివారం రాష్ట్ర యువతకు ఆయన బహిరంగ లేఖ రాశారు. యువత కష్టపడి చదివి కలలను నిజం చేసుకోవాలని, ఉద్యోగ నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 


ప్రైవేటురంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, ఇప్పటి వరకు ప్రైవేటురంగంలో సుమారు 17 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అద్భుతమైన ఆవిష్కరణలతో వచ్చే యువతను ప్రోత్సహించడానికి స్టార్టప్‌‌‌‌ ఈకో సిస్టం ఏర్పరిచామని.. టీ హబ్‌‌‌‌, టీ వర్క్స్‌‌‌‌, వీ హబ్‌‌‌‌, టీఎస్‌‌‌‌ఐసీ లాంటి వేదికలు ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీకి మించి తమ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తోందని, మేనిఫెస్టోలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీకి తగ్గట్టుగా మొదటి ప్రభుత్వంలో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు విజయవంతంగా పూర్తి చేశామని కేటీఆర్​ తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో చేపట్టామని అన్నారు. ఇప్పటికే 32 వేల ఉద్యోగాల భర్తీకి పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌, ఇతర శాఖలు నోటిఫికేషన్లు ఇచ్చాయని, గురుకుల విద్యాసంస్థలు అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నాయని తెలిపారు. మొత్తంగా 2.25 లక్షల పైచిలుకు ఉద్యోగాలను అతి తక్కువ టైంలోనే భర్తీ చేసి దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలువబోతున్నదని ఆయన పేర్కొన్నారు. ‘‘స్వరాష్ట్రంలో స్థానికులకే ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ ప్రాధాన్యత దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి, ఆఫీస్‌‌‌‌ సబార్డినేట్‌‌‌‌ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు తెచ్చేలా కొత్త జోనల్‌‌‌‌ వ్యవస్థ తీసుకొచ్చాం. నిరుద్యోగుల కోరిక మేరకు ఉద్యోగ నియామకాల గరిష్ట వయోపరిమితిని పెంచాం. తద్వారా ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాం” అని తెలిపారు.  

ప్రతి ఉద్యోగం పారదర్శకంగా ఇచ్చినం

ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఏండ్ల తరబడి ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించామని కేటీఆర్​ పేర్కొన్నారు. త్వరలోనే మరో పది వేల మంది కొలువులను క్రమబద్దీకరించబోతున్నామని తెలిపారు. నోటిఫికేషన్ల జారీతో పాటు వాటిని వేగంగా రిక్రూట్‌‌‌‌ చేసేందుకు భిన్నమైన నియామక ప్రక్రియ అనుసరిస్తున్నామని, పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌తో పాటు పోలీస్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు, గురుకుల బోర్డుల ద్వారా నియామకాల భర్తీ ప్రక్రియను వికేంద్రీకరించామన్నారు. ఫలితంగా ఏండ్ల తరబడి సాగే నియామక ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి ఉద్యోగాన్ని అత్యంత పారదర్శకంగా ఇచ్చామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా గ్రూప్‌‌‌‌ -1 ఉద్యోగాల్లోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికామన్నారు. నిరుద్యోగుల ప్రిపరేషన్‌‌‌‌ కోసం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా కోచింగ్​ సెంటర్లు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు ఉపయోగపడేలా లైబ్రరీలను బలోపేతం చేశామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగపర్వం నడుస్తోందని, సీఎం కేసీఆర్‌‌‌‌ ఆశయానికి తగ్గట్టుగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకుండా.. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యంపైనే యువత గురిపెట్టాలని, సానుకూల దృక్పథంతో సాధన చేసి స్వప్నాలను సాకారం చేసుకోవాలని బహిరంగ లేఖలో ఆయన సూచించారు. కాలం తిరిగి రాదని, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఇప్పటిదాకా ఒకెత్తు.. ఇప్పుడు ఒకెత్తు అని.. ప్రాణం పెట్టి చదివి స్వప్నాలను నిజం చేసుకోవాలని సూచించారు.