రాష్ట్రంలో బీజేపీ లేదు.. కాంగ్రెస్ మాకు పోటీనే కాదు: కేటీఆర్

రాష్ట్రంలో బీజేపీ లేదు.. కాంగ్రెస్ మాకు పోటీనే కాదు: కేటీఆర్
  • రాష్ట్రంలో బీజేపీ లేదు..  కాంగ్రెస్ మాకు పోటీనే కాదు
  • బాగా పన్జేసినోళ్లకే టికెట్లు ఇస్తం: కేటీఆర్
  • రూల్స్ ప్రకారమే ఓఆర్ఆర్ టెండర్ 
  • అసదుద్దీన్​ది ద్వంద్వ వైఖరి
  • దమ్ముంటే సీఎం అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ, కాంగ్రెస్​కు సవాల్


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసలు బీజేపీనే లేదని, కాంగ్రెస్‌‌కు తమతో పోటీ పడేంత స్థాయి లేదని మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. ‘‘మళ్లీ మేమే గెలుస్తం. ఈసారి మా పార్టీకి 90 నుంచి 100 సీట్లు వస్తాయి. కేసీఆరే మరోసారి సీఎం అవుతారు” అని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే సీఎం అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ, కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. 


ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో బాగా పన్జేసినోళ్లకే టికెట్లు దక్కుతాయని ఆయన చెప్పారు. ‘‘వెనుకబడిన ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకో ఆర్నెళ్లు ఉన్నందున వీళ్ల టికెట్ల విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేం” అని అన్నారు. 

దేశంలో ఆ రెండే పార్టీలు ఉన్నాయా? 

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘‘తెలంగాణలో మైనార్టీల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాలకు వెళ్లి పొగిడిన అసదుద్దీన్.. ఇక్కడికొచ్చి విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎక్కడ మాట్లాడింది కరెక్టో.. ముందు ఆయన తెలుసుకోవాలి” అని అన్నారు. ‘‘ప్రజలు మతం ప్రాతిపదికన ఓట్లు వేస్తారని నేను అనుకోవడం లేదు. మైనార్టీలంతా కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్‌‌, ఎంఐఎంకే ఓటు వేస్తారని కూడా అనుకోవడం లేదు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని భావిస్తున్నాను” అని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి ‘చేతిలో ఉన్న రూపాయి పడేసి.. చిల్లర ఏరుకోవద్దు’ అని ప్రజలకు సూచించారు. దేశంలో కాంగ్రెస్‌‌, బీజేపీ తప్ప వేరే పార్టీలు లేవు అన్నట్టుగా మాట్లాడడం సరికాదన్నారు. 

లోక్ సభ సీట్ల పెంపుపై చర్చ జరగాలి.. 

అవుటర్ రింగ్‌‌ రోడ్ (ఓఆర్ఆర్) టెండర్ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఇందులో తప్పు జరిగినట్టు ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని ప్రతిపక్షాలకు సూచించారు. ‘‘లోక్‌‌సభ సీట్ల పెంపుపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో పన్నులు కడుతున్నారు. ఉచితాలు అనుచితం అంటూ మాట్లాడుతున్న నాయకులు, ప న్నులు చెల్లిస్తున్నామంటూ మాట్లాడుతున్న జనాలు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని అన్నారు. రాహుల్ పార్టీకి బదులు ఎన్‌‌జీవో లేదా దుకాణం నడపాలని విమర్శించారు. కాగా, తన విదేశీ పర్యటనతో 42 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తెలంగాణకు తీసుకొచ్చానని కేటీఆర్ తెలిపారు.