మూసీ నదిపై ఎక్స్‌‌‌‌ప్రెస్ వే నిర్మిస్తం : మంత్రి కేటీఆర్

మూసీ నదిపై ఎక్స్‌‌‌‌ప్రెస్ వే నిర్మిస్తం : మంత్రి కేటీఆర్

మూసీ నదిపై ఎక్స్‌‌‌‌ప్రెస్ వే నిర్మిస్తం

గండిపేట, వెలుగు : హైదరాబాద్‌‌‌‌ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. శంషాబాద్ నుంచి మూసీ నదిపై ఎక్స్‌‌‌‌ప్రెస్ వే నిర్మిస్తామని తెలిపారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణానికి ఇదివరకే అనుమతిలిచ్చామని పేర్కొన్నారు. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌‌‌‌ను శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. నార్సింగి వద్ద కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంటర్ చేంజ్ ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంప్ తో నార్సింగి, మంచిరేవుల, గండిపేటకు వెళ్లే వారితో పాటు లంగర్ హౌస్, శంకర్ పల్లి నుంచి వచ్చే వారు ఓఆర్ఆర్ మీదుగా జర్నీ చేసేందుకు ఈజీ అవుతుందన్నారు. తర్వాత కోకాపేటలో నిర్మిస్తున్న 15 ఎంఎల్‌‌‌‌డీ సామర్థ్యం ఉన్న ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్‌‌‌‌మెంట్ ప్లాంట్)ను కేటీఆర్, సబిత పరిశీలించారు.

దేశంలో 100 శాతం ఎస్టీపీ ఉన్న నగరంగా హైదరాబాద్‌‌‌‌ను నిలపాలనే లక్ష్యంతో సిటీలో 1,259 ఎంఎల్‌‌‌‌డీ సామర్థ్యం ఉన్న సీవరేజ్ ట్రీట్​మెంట్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లోగా ఎస్టీపీలను పూర్తి చేస్తామని చెప్పారు. ‘‘మెహిదీపట్నంలో స్కైవాక్ కోసం రక్షణ మంత్రిని స్థలం అడిగాం. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని అడిగినా స్పందన లేదు. శామీర్ పేట - జేబీఎస్ స్కైవాక్ కోసం రక్షణ భూములివ్వాలని అడిగాం. ఈ విషయంలో ప్రజలకు ప్రధాని తీపి కబురు చెప్పాలి. ఆగస్టులో హైదరాబాద్​లో సైకిల్ ట్రాక్ ప్రారంభిస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.