సిరిసిల్ల ప్రజలు భయపడొద్దు.. డీఆర్ఎఫ్ బృందాన్నిపంపిస్తున్నా..

సిరిసిల్ల ప్రజలు భయపడొద్దు.. డీఆర్ఎఫ్ బృందాన్నిపంపిస్తున్నా..

హైదరాబాద్: సిరిసిల్లలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సిరిసిల్లలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్‎లతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరదలో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రానున్న 48 గంటల పాటు వర్షపాతం ఉన్నందున వరద మల్లింపుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. వరదల నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని.. అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన భరోసానిచ్చారు. కాగా.. జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మరోసారి కలెక్టరేట్ ప్రాంగణం నీట మునిగింది. కలెక్టరేట్ ముందు, చుట్టు పక్కల మొత్తం మనిషి లోతు నీళ్లు నిలిచిపోయాయి.