పచ్చదనం పెంపుపై రాష్ట్రాల మధ్య పోటీ పెంచాలె

పచ్చదనం పెంపుపై రాష్ట్రాల మధ్య పోటీ పెంచాలె
  • నేషనల్ ఫారెస్ట్ వర్క్‌ షాపులో మంత్రి కేటీఆర్‌‌

హైదరాబాద్‌, వెలుగు: అడవులు, పచ్చదనం పెంపుపై రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెంచడం కోసం గ్రీన్‌ ర్యాంకింగ్స్ విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ సూచించారు. నెట్ జీరో కార్బన్ లక్ష్య సాధన దిశగా రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు ఈ ర్యాంకింగ్ విధానం తోడ్పడుతుందన్నారు.  హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలోఅటవీ శాఖ జాతీయ వర్క్ షాప్​ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి  కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఆధునిక, సాంకేతిక  పద్ధతుల్లో అటవీశాఖ నిర్వహణ, కంపా నిధుల సద్వినియోగం, అడవుల పునరుద్ధరణ పనులపై ఈ వర్క్ షాప్ లో చ‌ర్చించారు. ఇందులో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‌పారిశ్రామిక అభివృద్ధితోపాటు, పచ్చదనం కూడా అత్యంత ప్రాధాన్యమైన అంశమన్నారు. రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం హరితహారం వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ చర్యలతో రాష్ట్రంలో గ్రీన్ కవర్‌‌ 24 నుంచి 31 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణ, హైదరాబాద్ ఈఓడీబీ ర్యాంకులతో పాటు పచ్చదనం పెంపులోనూ అగ్రగామిగా ఉందని చెప్పారు. 

ఉపాధిహామీ పథకం నిధులను పచ్చదనం పెంపు కోసం ఉపయోగిస్తున్నామన్నారు. బాగా పనిచేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా కాంపా నిధులను అదనంగా ఇవ్వాలని కేటీఆర్ కోరారు.  కృషి విజ్ఞాన కేంద్రాల తరహాలో అటవీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో అక్రమంగా చెట్ల నరికివేత, కర్ర, జంతువుల స్మగ్లింగ్‌ను దాదాపు అరికట్టామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.    అడవుల పునరుద్ధరణ కోసం తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని జాతీయ అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సి.పి.గోయల్ అభినందించారు. కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ డీజీ, ప్రత్యేక కార్యదర్శి చంద్ర ప్రకాశ్‌ గోయ‌ల్, అద‌న‌పు డీజీ, జాతీయ కాంపా సీఈవో  సుభాష్ చంద్ర , రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు.